సీపీ కదలికలకు సవాలు… జీవితానికి కాదు…
అవగాహన, ముందస్తు గుర్తింపు, పునరావాసంతో అవకాశాలను విస్తరించవచ్చు
అమరావతి టుడే ప్రతినిధి:
ఒక చిన్నారి తన వయసుకు తగిన సమయంలో కూర్చోలేకపోవడంం నడవడంలో ఆలస్యం కావడంం చేతులు, కాళ్ల కదలికల్లో అసాధారణత కనిపించడంం శరీరంలో కండరాలు చాలా బిగుసుకుపోవడం.. చాలా వదులుగా ఉండటం. ఇలాంటి లక్షణాలను చాలాసార్లు ‘‘ఇంకొంచెం పెరిగితే సరిచేస్తుంది’’ అంటూ వాయిదా వేస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి సెరిబ్రల్ పాల్సీ వంటి నాడీ సంబంధిత అభివృద్ధి సమస్యలకు సంకేతాలు కావచ్చు.›సెరిబ్రల్ పాల్సీ గురించి సరైన అవగాహన ఉండటం అంటే కేవలం ఒక వ్యాధి గురించి తెలుసుకోవడం కాదు. ఒక చిన్నారి అభివృద్ధిలో కనిపించే సంకేతాలను సమయానికి గుర్తించడం, సరైన వైద్య సహాయం పొందడం, పునరావాస సేవలను అందించడం, ముఖ్యంగా ఆ చిన్నారిని సమాజంలో సమానమైన వ్యక్తిగా చూడటం.
అసలు సెరిబ్రల్ పాల్సీ అంటే ఏమిటి…?
సెరిబ్రల్ పాల్సీ అనేది అభివృద్ధి చెందుతున్న మెదడులో ఏర్పడే అసాధారణ అభివృద్ధి లేదా నష్టం కారణంగా కదలికలు, శరీర భంగిమ , సమతుల్యత , కండరాల నియంత్రణపై ప్రభావం చూపే పరిస్థితుల సమూహం. సెరిబ్రల్ అంటే మెదడుకు సంబంధించింది. ఫాల్సీ అంటే కండరాల వినియోగం లేదా కదలికలో ఇబ్బంది అని అర్థం.
ఇది ముఖ్యంగా బాల్యంలో కనిపించే మోటార్ వైకల్యాల్లో అత్యంత సాధారణమైనదిగా వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రతి సెరిబ్రల్ పాల్సీ ఒకేలా ఉండదు. కొందరికి స్వల్ప స్థాయి కదలిక సమస్యలు మాత్రమే ఉండవచ్చు; మరికొందరికి నడవడానికి సహాయక పరికరాలు లేదా దీర్ఘకాలిక సహాయం అవసరం కావచ్చు.
సెరిబ్రల్ పాల్సీ లక్షణాలు:
సెరిబ్రల్ పాల్సీ ఉన్న ప్రతి వ్యక్తిలో లక్షణాలు ఒకే విధంగా ఉండవు.
ప్రధానంగా కనిపించే కదలిక సమస్యల ఆధారంగా దీనిని వివిధ రకాలుగా వర్గీకరిస్తారు.
స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ:
కండరాలు బిగుసుకుపోవడం, కదలికలు కఠినంగా ఉండటం ప్రధాన లక్షణాలు. ఇది సెరిబ్రల్ పాల్సీలో అత్యంత సాధారణ రకం.
డిస్కైనెటిక్ సెరిబ్రల్ పాల్సీ:
వ్యక్తి తన కదలికలను పూర్తిగా నియంత్రించలేకపోవడం, అనియంత్రిత కదలికలు కనిపించడం దీని లక్షణాల్లో ఒకటి.
అటాక్సిక్ సెరిబ్రల్ పాల్సీ:
సమతుల్యత, కదలికల సమన్వయంలో ఇబ్బందులు ప్రధానంగా కనిపిస్తాయి.
మిక్స్‌డ్ సెరిబ్రల్ పాల్సీ:
ఒకటి కంటే ఎక్కువ రకాల కదలిక సమస్యలు కలిసిన పరిస్థితి.
సీపీకు కారణాలు ఏమిటి ?
గతంలో సెరిబ్రల్ పాల్సీకి ప్రధాన కారణం ప్రసవ సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడమే అని విస్తృతంగా భావించేవారు. కానీ ప్రస్తుత వైద్య అవగాహన ప్రకారం సీపీకు కారణాలు మరింత విస్తృతమైనవి. అభివృద్ధి చెందుతున్న మెదడు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం లేదా మెదడుకు నష్టం కలగడం వల్ల సీపీ ఏర్పడవచ్చు. ఈ మార్పులు పుట్టుకకు ముందు, ప్రసవ సమయంలో లేదా పుట్టిన తర్వాత మెదడు ఇంకా అభివృద్ధి చెందుతున్న తొలి సంవత్సరాల్లో సంభవించవచ్చు. అనేక సందర్భాల్లో ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడం సాధ్యం కాదు. పుట్టిన తర్వాత వచ్చే కొన్నిసీపీ కేసులు ఇన్ఫెక్షన్లు లేదా తలకు గాయాలతో సంబంధం కలిగి ఉండవచ్చు.
అందువల్ల ప్రతి సీపీ కేసుకు ఒకే కారణాన్ని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు.
తల్లిదండ్రులు గమనించాల్సిన సంకేతాలు
పిల్లల అభివృద్ధిలో ప్రతి చిన్న ఆలస్యం సీపీ అని అర్థం కాదు. అయినప్పటికీ కొన్ని సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు.
ఉదాహరణకు:
వయసుకు తగిన సమయంలో బోర్లా తిరగడం, కూర్చోవడం, నిలబడటం లేదా నడవడంలో ఆలస్యం. శరీరం లేదా కండరాలు చాలా గట్టిగా లేదా చాలా వదులుగా అనిపించడం.
ఒక వైపు శరీరాన్ని మాత్రమే ఎక్కువగా ఉపయోగించడం.
చేతులు, కాళ్ల కదలికల్లో అసమానత. కదలికలు లేదా సమతుల్యతలో స్పష్టమైన ఇబ్బంది. అసాధారణమైన నడక విధానం.
కొన్ని సందర్భాల్లో అనియంత్రిత కదలికలు.
ఈ లక్షణాలు కనిపించడమే సీపీ నిర్ధారణకు ఆధారం కాదు. వైద్యుల సమగ్ర అభివృద్ధి మరియు నాడీ సంబంధిత మూల్యాంకనం అవసరం.

డాక్టర్ టీ కృష్ణకుమారి.. చేయూత మానసిక వికలాంగుల శిక్షణ సంస్ధ డైరెక్టర్
సెరిబ్రల్ ఫాల్సీ అనుమానం ఉంటే ఆలస్యం చేయకండి వెంటనే నిపుణుడిని సంప్రదించండి. సీపీకు చికిత్స అంటే ఒక్క మందు కాదు
సెరిబ్రల్ పాల్సీకి ప్రస్తుతం ఒకే ఒక్క ‘‘క్యూర్’’ లేదు. అయితే సరైన సమయంలో ప్రారంభించే చికిత్సలు మరియు పునరావాస సేవలు వ్యక్తి కదలిక, కమ్యూనికేషన్, రోజువారీ కార్యకలాపాలు మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.కావున సాధ్యమైనంత వరకు ఆరంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందంచటం ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
Views: 56







