అమరావతి టుడే ప్రతినిధి :
సత్యనారాయణపురం శ్రీ విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు అద్భుతమైన గరగ నృత్య ప్రదర్శనతో అఖిల భారత స్ధాయి పోటీలకు ఎంపికయ్యారు. గణిత విజ్ఞాన మేళా సంస్కృతి మహోత్సవంలో భాగంగా నిర్వహించిన నృత్య పోటీలలో శ్రీ విజ్ఞాన విహార పాఠశాల విద్యార్థులు గరగ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీలలో విద్యార్థులు తొలుత సంకుల స్థాయిలో, అనంతరం ప్రాంతీయ స్థాయిలోనూ విజయాన్ని సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.ఆ తర్వాత జరిగిన పోటీలలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పోటీపడి విజయం సాధించి అఖిల భారత స్ధాయి పోటీలకు అర్హత సాధించారు. వరుస విజయాలతో ముందుకు సాగిన శ్రీ విజ్ఞాన విహార విద్యార్థులు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో జరగనున్న అఖిల భారత స్థాయి ప్రదర్శనకు ఎంపిక కావటం పట్ల పాఠశాల ప్రెసిడెంట్ బీవీఎస్టీ సాయి హర్షం వ్యక్తం చేశారు.తమ పాఠశాల విద్యార్ధులు సాంప్రదాయ జానపద కళారూపమైన గరగ నృత్యాన్ని చక్కటి హావభావాలు, లయబద్ధమైన నృత్య కదలికలు సమన్వయంతో ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. , విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు విద్యతో పాటు కళలు, సంస్కృతి .. సంప్రదాయాలకు పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తమవిద్యార్థులు ప్రతిభను చాటి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి దశలోనూ విజయాన్ని సాధిస్తూ చక్కటి ప్రతిభను చాటి నూతక్కిలో ఆదివారం జరిగిన పోటీలలో ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడి అఖిల భారత స్థాయి వరకు చేరుకోవడం నగరానికి, పాఠశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు. విద్యార్ధులు మరింత మెరుగైన ప్రదర్శనతో జాతీయ స్ధాయిలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్ధులను పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్ధులు అభినందించారు.
Views: 5334







