– పది రోజుల్లో రూ. 6 కోట్లకు పైగా వ్యాపారాలు
– దేశవ్యాప్తంగా 1500 మంది మహిళా పారిశ్రామికవేత్తల హాజరు
– ఎన్ఐఆర్‌డీ – సరస్ మేళా సమన్వయకర్త కటారియా
అమరావతిటుడే ప్రతినిధి : మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలను పరస్పరం పంచుకునేందుకు, నెట్‌వర్కింగ్‌కు, గ్లోబల్ బ్రాండింగ్‌కు సరస్ మేళా ఒక గొప్ప వేదికగా నిలిచిందని ఎన్ఐఆర్‌డీ – సరస్ మేళా సమన్వయకర్త కటారియా తెలిపారు. సాధారణంగా దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగే జాతీయస్థాయి సరస్ మేళాను.. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తొలిసారిగా విజయవాడలో నిర్వహించడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మేళా ప్రాంగణంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశతో కలిసి పాల్గొన్నారు. కటారియా మాట్లాడుతూ… భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన నాటి నుంచి మేళాకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని వెల్లడించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 600 స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల స్టాళ్లు ఏర్పాటు చేశారన్నారు. గత 10 రోజుల్లోనే రూ. 6 కోట్లకుపైగా వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయని, ఇది ఢిల్లీ స్థాయి అమ్మకాలతో సమానమని ఆయన స్పష్టం చేశారు. ఇండియా ఫుడ్ కోర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, దేశంలోని విభిన్న సంప్రదాయ వంటకాలను ప్రజలకు రుచి చూపిస్తూ మహిళా సంఘాలు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నాయని ప్రశంసించారు. సరస్ మేళా కేవలం వస్తువుల విక్రయాలకే పరిమితం కాకుండా మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలను పరస్పరం పంచుకునేందుకు ప్రతిరోజూ బయ్యర్స్, వివిధ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఉత్పత్తుల బల్క్ ఆర్డర్లు, ప్రమోషన్లకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల చేనేత, హస్తకళల నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకే ఒకేచోట లభిస్తున్నాయన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 13 న ప్రారంభమైన ఈ మేళా 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా దాదాపు 1,500 మందికి పైగా గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారన్నారు. సరస్ మేళా కోఆర్డినేటర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ సందర్శకులు, చేతివృత్తుల వారికి సహాయపడేందుకు వెల్‌కమ్ పెవిలియన్, వివిధ ప్రభుత్వ శాఖల పథకాలను వివరించేందుకు కన్వర్జెన్స్ పెవిలియన్, మహిళలకు బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు మీట్ అండ్ గ్రీట్ పెవిలియన్, వస్తువుల తయారీని ప్రత్యక్షంగా ప్రదర్శించేందుకు డెమో పెవిలియన్లను నెలకొల్పామన్నారు. వీటితో పాటు హెల్త్ డెస్క్, మదర్ కేర్ రూమ్, పిల్లల ఆటల కోసం ప్రత్యేక జోన్ వంటి అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు. విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, వివిధ ప్రాంతాల ప్రజలు ఈ మేళాను సందర్శించి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. సమావేశంలో అస్సాంకు చెందిన లఖ్‌పతిదీదీ బర్నాలి పాఠక్ తమ చేనేత వస్త్రాలు, తెలంగాణకు చెందిన లఖ్‌పతిదీదీ రాధిక తమ హస్తకళాభరణాలకు సరస్ మేళా గొప్ప వేదికగా నిలుస్తోందని.. విజయవాడ, పరిసర ప్రాంత ప్రజలు తమను ఎంతో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
Views: 196







