
నాలుగు నెలల చిన్నారి గుండెలో పెద్ద రంధ్రం.. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం
పాప ప్రాణం కోసం రోజంతా ఆసుపత్రిలో మంత్రి సుభాష్
పేద తల్లిదండ్రులకు పెద్దదిక్కుగా నిలిచిన మంత్రి సుభాష్
ఆసుపత్రికి స్వయంగా వెళ్లి వైద్యులతో మాట్లాడిన మంత్రి సుభాష్
ఎల్ వో సి తో పాటు ఆపరేషన్ ఖర్చులు భరిస్తానని హామీ.. తల్లిదండ్రులకు భరోసా
అమరావతి టుడే ప్రతినిధి :
పుట్టిన నాలుగు నెలలకే తీవ్రమైన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పెద్దదిక్కుగా నిలిచారు. పేదరికంతో వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ.. ఆ చిన్నారి వైద్యానికి అవసరమైన పూర్తి సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సి)తో పాటు ఆపరేషన్ కు అవసరమైన ఖర్చులు భరిస్తానని భరోసా కల్పించారు. పనులన్నీ పక్కనపెట్టి పాప ప్రాణం కోసం మంత్రి పడిన తాపత్రయం ఆయన మానవత్వానికి నిదర్శనం. వివరాల్లోకెళితే
రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం శివారు చింతగుంట చెరువుకు చెందిన మేడిశెట్టి జీవన్ కుమార్- చంద్రిక దంపతుల నాలుగు నెలల చిన్నారి రియాన్సీ గ్రేస్ పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి తరచూ ఆయాసపడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చూపించారు. వైద్య పరీక్షల్లో చిన్నారి గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన ఆంధ్ర ఆసుపత్రి విజయవాడ వైద్యులు వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు.
అయితే ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును భరించే స్థోమత లేక ఆ నిరు పేద తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో మంత్రి సుభాష్‌ను ఆశ్రయించారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రి వెంటనే స్పందించారు. చిన్నారిని విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రికి స్వయంగా తీసుకెళ్లి, అక్కడి వైద్యులతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లోనే ఆపరేషన్ జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైద్యులను కోరారు.
చిన్నారి వైద్యానికి అవసరమైన ఖర్చును తాను భరిస్తామని మంత్రి సుభాష్ వైద్యులకు, చిన్నారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగి చిన్నారి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరేలా అవసరమైన సహాయాన్ని అందిస్తానని వారికి ధైర్యం చెప్పారు.
తమ చిన్నారి ప్రాణాల కోసం ఆందోళన చెందుతున్న సమయంలో మంత్రి సుభాష్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడటం, తమకు అండగా నిలవడం పట్ల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఈ సమయంలో మంత్రి సుభాష్ అందించిన భరోసా జీవితాంతం మర్చిపోలేమని వారు తెలిపారు.
ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అది తన కుటుంబానికి వచ్చిన కష్టంగా భావిస్తూ స్పందిస్తున్న మంత్రి సుభాష్ సేవాగుణానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. పదవికి పరిమితం కాకుండా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, అవసరమైన సమయంలో పెద్దకొడుకులా ధైర్యం కల్పిస్తున్నారంటూ పలువురు అభినందిస్తున్నారు.
చిన్నారి రియాన్సీ గ్రేస్‌కు శస్త్రచికిత్స విజయవంతమై, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆ కుటుంబానికి మంత్రి సుభాష్ అందిస్తున్న అండ, ఆప్యాయత వారికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఇదే కదా నిజమైన మానవత్వం, సేవాగుణం అంటూ మంత్రి సుభాష్ పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు.
Views: 910







