మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
అమరావతిటుడే ప్రతినిధి : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్ ఊర్మిళా నగర్, ఏకలవ్య నగర్, పరిసర ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార పాదయాత్ర శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని, స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి అల్లం భువన కుమార్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిని, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అల్లం భువన కుమార్‌ను ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 40వ డివిజన్‌లో స్థానికుడు, బీసీ వర్గానికి చెందిన అల్లం భువన కుమార్‌కు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టికెట్ కేటాయించడం అభినందనీయమని వెలంపల్లి తెలిపారు. పార్టీ మాజీ కార్పొరేటర్ సంధ్యారాణి, బాపతు కోటిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు కంది శ్రీనివాసరెడ్డి నాయకులంతా కలిసికట్టుగా ఒకే తాటిపై ప్రచారం చేస్తున్నారని, మహిళలు జగనన్నను గెలిపించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ డివిజన్‌లో బీజేపీ, జనసేన పార్టీల వైఖరిని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారో, ఎవరు ఎవరి కండువా కప్పుకుంటున్నారో అర్థం కాని గందరగోళం నెలకొందన్నారు. జనసేన అభ్యర్థి బీజేపీ కండువా, బీజేపీ అభ్యర్థి జనసేన కండువా వేసుకుని తిరుగుతున్నారని, ఇలాంటి వింత పోకడలు ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకి ఓడిపోతామని తెలిస్తే ఎంతకైనా తెగిస్తారని వెలంపల్లి మండిపడ్డారు. గతంలో నిమ్మగడ్డ రమేష్‌ను, ఇప్పుడు ఉన్న ఎస్‌ఈసీని అడ్డం పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేయించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విత్‌డ్రాలు ముగిసిన వెంటనే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సిన బాధ్యత ఎస్‌ఈసీకి ఉన్నప్పటికీ, ఇప్పటికీ కొన్ని డివిజన్లలో అభ్యర్థులు ఎవరో తెలియని అగమ్యగోచర పరిస్థితిని ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, అభివృద్ధి శూన్యమని, మోసపూరిత మాటలతోనే కాలం గడుపుతోందని విమర్శించారు. రౌడీయిజం, అధికార బలంతో ఎన్నికల్లో నెగ్గాలని చూసినా, ప్రజల మనస్సుల నుంచి వారు ఎప్పుడో చెరిగిపోయారని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని మొత్తం 28 డివిజన్లలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు గట్టి పోటీనిస్తూ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారని, వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Views: 112







