
డిజిటల్ సంస్కరణలతో పారదర్శకత
ఒక్కో సంఘానికి ఏటా రూ.32,500 వరకు ఆదా
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి టుడే ప్రతినిధి :
స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) బ్యాంక్ లింకేజీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఎన్ఆర్ఎల్ఎం తాజా గణాంకాల ప్రకారం 2026 సెప్టెంబర్ 15 నాటికి రాష్ట్రంలో రూ.15,229.40 కోట్ల రుణాలు పంపిణీ చేయగా.. రూ.82,639.56 కోట్ల రుణ నిల్వ ఉందన్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో 7–14.50 శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లను 7–11.70 శాతం పరిధికి తగ్గించినట్లు మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్, సర్వీస్ ఛార్జీల తగ్గింపుతో ఒక్కో సంఘానికి ఏడాదికి రూ.32,500 వరకు ఆదా అవుతోందన్నారు. డిఏవై- ఎన్ఆర్ఎల్ఎం మార్గదర్శకాల ప్రకారం హామీ లేని రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు.
డిజిటల్ నిఘాతో అక్రమాలకు చెక్
ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ, సభ్యుల గుర్తింపు ధ్రువీకరణతో నకిలీ సభ్యత్వాలు, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి సంఘానికి ప్రత్యేక విశిష్ట రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించి లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చుతున్నామన్నారు. రియల్‌టైమ్ డాష్‌బోర్డుల ద్వారా ఎస్‌హెచ్‌జీ లప్రొఫైల్స్, గ్రేడింగ్, రుణ వివరాలను బ్యాంకులు పరిశీలించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
రూ.19,655 కోట్ల లక్ష్యం
2024–25లో రూ.32,190 కోట్ల లక్ష్యానికి గాను రూ.30,079 కోట్లు రుణాలుగా పంపిణీ చేసి 93 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు మంత్రి తెలిపారు. 2025–26లో 99 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. 2026–27లో సెప్టెంబర్ నాటికి రూ.19,655 కోట్ల లక్ష్యానికి గాను రూ.15,229 కోట్లు పంపిణీ చేసి 78 శాతం సాధించినట్లు వెల్లడించారు.
Views: 168







