
ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
స్పందన సేవాసమితి సేవలు నిరుపమానం
ప్రముఖ న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా
అమరావతి టుడే ప్రతినిధి:
ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగణంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న స్పందన సేవాసమితి సేవలు నిరుపమానం అని ఆధ్యాత్మికవేత్త, కళాపోషకులు, ప్రముఖ న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా కొనియాడారు. స్ధానిక ప్రశాంతినగర్ ఒకటో లైనులో ఆదివారం స్పందన సేవాసమితి ఆధ్వర్యాన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని స్పందన సేవాసమితి వ్యవస్ధాపక అధ్యక్షులు ఇమ్మానేని కృష్ణప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని మన పెద్దలు కంటి ప్రాముఖ్యతను తెలియ చేశారన్నారు. అటువంటి నేత్రాలను పరిరక్షించేందుకు ఇంత మంచి మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయం అని కొనియాడారు. తక్కిన వారు స్పందన సేవాసమితి స్ఫూర్తితో తోచినంతలో సేవాకార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
200 మందికి ఉచిత కంటి వైద్యపరీక్షలు
మెగా కంటి వైద్య శిబిరంలో కేర్ – క్యూర్ హాస్పిటల్స్ డాక్టర్ గౌతమి,వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ అనిల్ శేషు కుమార్ ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా నేత్రాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఉచిత వైద్యసేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకర జీవనం సాగించాలని సూచించారు.
రూ.37,500 విలువ గల కళ్ళజోళ్ళు పంపిణీ
మెగా కంటి వైద్య శిబిరంలో భాగంగా కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్స్ వారు ఇచ్చిన రూ.37,500 విలువ గల కళ్ళజోళ్లను 125 మంది పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు. తమ వంతు బాధ్యతగా తాము సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సేవలు విస్తృతం
స్పందన సేవాసమితి సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు సమితి స్ధాపక అధ్యక్షులు ఇమ్మానేని కృష్ణప్రసాద్ తెలిపారు. తాము చేస్తున్న సేవాకార్యక్రమాలకు సహకరిస్తున్న సమితి సభ్యులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సేవాసమితి ప్రధాన కార్యదర్శి సాంబశివరావు , కోశాధికారి విమల రాణి కమిటీ సభ్యులు లంకేశ్వరరావు, యల్లాప్రగడ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Views: 658







