
– వైద్యశాఖలో ఏఐ ఆధారిత నూతన “ఎంఎంఏట్రిక్స్” పోర్టల్
– రియల్ టైంలో వినతుల పరిష్కార చర్యలు
– నిరంతర పర్యవేక్షణ
– ఈ తరహా వ్యవస్థ ప్రభుత్వ శాఖల్లో ఇదే తొలిసారి
అమరావతి టుడే ప్రతినిధి :
కాగిత రహిత పాలనలో భాగంగా మంత్రివర్యుల కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పరిష్కారం అయ్యే వరకు దాని పురోగతిని పర్యవేక్షించే ఎంఎంఏట్రిక్స్ ఏఐ ఆధారిత పోర్టలును త్వరలో వైద్యారోగ్యశాఖలో అందుబాటులోకి తీసుకురానున్నారు. అర్జీ ఎక్కడ ఉంది, ఎవరి వద్ద ఉంది, ఏ చర్య తీసుకున్నారు, ఇంకా ఏం చేయాలి, ఎప్పటిలోగా పరిష్కరించాలి అనే వివరాలు ఇందులో నమోదవుతాయి. సాధారణంగా 10 పనిదినాల్లో ప్రక్రియను పూర్తి చేసేలా గడువు నిర్దేశించనున్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చే వినతులపై మంత్రి జారీ చేసిన ఆదేశాల అమలు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఈ విధానాన్ని రూపొందించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ దీనికి రూపకల్పన చేసింది. ప్రస్తుతం వినతుల స్వీకరణ, వాటిపై తీసుకున్న చర్యలు, పరిష్కార స్థితికి సంబంధించిన సమాచారం సంతృప్తికరంగా అందుబాటులో లేకపోవడంతో.. విస్తృత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త విధానానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ శాఖల్లో ఇదే తొలిసారి. ఈ విధానంలో వివిధ వర్గాల వారు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే వినతులపై శాఖపరమైన తీసుకునే చర్యలను నిశితంగా పోర్టల్ ద్వారా మంత్రి, కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఇతర హెచ్ ఓ డి లు ఎప్పటికప్పుడు అని స్థాయిల్లో తెలుసుకునేలా లాగిన్ సౌకర్యం కల్పించనున్నారు అలర్ట్ మెసేజ్లు కూడా ఇందులో ఉంటాయి. ఈ పోర్టల్ ద్వారా భవిష్యత్తులో మరికొన్ని మరికొన్ని సదుపాయాలు అందుబాటులోనికి రానున్నాయి.
మంత్రి సమీక్ష ఆదేశాల అమలు పై కూడా పర్యవేక్షణ
మంత్రి సమీక్ష సమావేశాల్లో ఇచ్చే ఆదేశాలను కూడా సమీక్ష చర్యల నమోదు విభాగంలో నమోదు చేస్తారు. బాధ్యత వహించే అధికారి, గడువు, తీసుకున్న చర్యలను నమోదు చేసి, గడువు దాటిన అంశాలను ప్రత్యేకంగా గుర్తిస్తారు. తదుపరి సమీక్షలో వాటి పురోగతిని పరిశీలించవచ్చు.
డ్యాష్‌బోర్డులో సమగ్రంగా
డ్యాష్‌బోర్డు ద్వారా పెండింగ్‌లో ఉన్న అర్జీలు, వివిధ శాఖల్లో ప్రక్రియలో ఉన్నవి, మంత్రివర్యుల స్థాయిలో పరిశీలించాల్సిన అంశాలను ఒకేచోట చూడవచ్చు. ఎంఎంఏట్రిక్స్ గుర్తింపు సంఖ్య, వినతిపత్రం సంఖ్య, ఈ-ఆఫీస్ స్వీకరణ సంఖ్య, దస్త్ర సంఖ్య, అంశం, దరఖాస్తుదారు, జిల్లా, నియోజకవర్గం వంటి వివరాలతో అర్జీని వెతకవచ్చు. ఎవరు, ఎప్పుడు ఏ చర్య తీసుకున్నారన్న వివరాలతో దాని పూర్తి చరిత్రను చూడవచ్చు.
ప్రజలకు ప్రయోజనం
అర్జీ ఇచ్చిన తర్వాత దాని పరిస్థితి తెలుసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. అర్జీ ఎవరి వద్ద ఉందో, ఏ చర్య తీసుకున్నారో, గడువు ఎంత ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తీసుకున్న చర్యలకు ఆధారాలు ఉండటంతో ప్రక్రియలో స్పష్టత పెరుగుతుంది. అర్జీ పరిష్కారమైన తర్వాత తీసుకున్న చర్యల వివరాలు దరఖాస్తుదారుకు చేరుతాయి. కాగిత రహిత విధానంలో జవాబుదారీతనం, పారదర్శకత పెంచడమే ఎంఎంఏట్రిక్స్ ప్రధాన ఉద్దేశం.
Views: 364







