– రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 46.9 శాతం ఓటు షేర్
– ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి

– సంక్షేమాన్ని ప్రజల దరిచేర్చడంలో ఎమ్మెల్యేలు, నాయకులు విఫలం
– ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి
అమరావతిటుడే ప్రతినిధి : రాబోయే ఎన్నికల్లో మళ్లీ కూటమికే అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ప్రతినిధి ముఖేష్ తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సర్వే నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. గత 2 నెలలుగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 52,500 మంది అభిప్రాయాలను సేకరించామన్నారు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకే మళ్లీ ఓటర్ల పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 46.9 శాతం ఓటు షేర్ (24,622 ఓట్లు) సాధించే అవకాశం ఉందని, వైసీపీ 35.0 శాతం కు ఓటు షేర్ పడిపోయిందన్నారు. కాగా జనసేన పార్టీ 9 శాతం ఓటు షేర్ సాధిస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా భారతీయ జనతాపార్టీకి 3.5 శాతం ఓటు షేర్ వస్తుందని చెప్పారు. ఇతరులకు 5.6 శాతం దక్కుతుందని వివరించారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. చంద్రబాబు దూరదృష్టి, అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని సర్వేలో వెల్లడైందన్నారు. అయితే సూపర్ సిక్స్ పథకాలను క్షేత్రస్థాయిలోకి పూర్తిస్థాయిలో తీసుకువెళ్లడంలో కూటమి కింద స్థాయి నేతలు విఫలమవుతున్నారన్నారు. తల్లికి వందనం ద్వారా ప్రయోజనం చేకూరుస్తున్నా ప్రజలు ఇంకా అమ్మ ఒడిగానే పిలుస్తున్నారని క్షేత్రస్థాయిలో నాయకులు ఆ పథకాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించలేకపోతున్నట్లు సర్వేలో తేలిందన్నారు.
ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి
ఇదిలా ఉండగా పలు నియోజకవర్గాల శాసనసభ్యుల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని సర్వేలో వెల్లడైందని ముఖేష్ చెప్పారు. ప్రతి నెల టీడీపీ నేతలో స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నా వాలంటీర్ల స్థాయి ప్రచారం రావడం లేదన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల ఇసుక, మట్టి, మద్యం వ్యాపారాలు, భూకబ్జాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారని చెప్పారు. గతంలో ఉన్న చంద్రబాబు మార్కు భయం అధికారుల్లో కనబడడం లేదన్నారు. వైసీపీ దాడిని తిప్పికొట్టడంలో జనసేన, బీజేపీ నేతలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని నివేదిక స్పష్టం చేస్తుందన్నారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో బీజేపీ నేతలు ఎక్కడా కనిపించకపోవడం పొత్తులో విభేదాలను బయటపెడుతుందన్నారు. లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ -ఆధిపత్య పోరు ఉందన్న ప్రచారం శ్రేణులను డిస్టర్బ్ చేస్తోందని సర్వేలో వెల్లడైందన్నారు.
రాయలసీమలో వైసీపీ జోరు
ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వైసీపీ బలపడుతున్నట్లు సర్వేలో తేలిందన్నారు. కడప జిల్లాలోని కమలాపురం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు సర్దుబాట్లు కూటమికి పెద్ద సవాలుగా మారనున్నాయని అంచనా వేశామన్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెజారిటీ స్థానాలు డిమాండ్ చేస్తున్నారని నివేదిక.ద్వారా వెల్లడైందన్నారు. స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో చెలరేగే విభేదాల వల్ల రెబల్స్ పోటీ చేసి వైసీపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Views: 336







