
ఆటోనగర్లో ఉచిత మెగా వైద్య శిబిరం
ఏఐ పరిజ్ఞానంతో అత్యాధునిక ఎక్స్–రే ద్వారా టీబీ పరీక్షలు
అమరావతి టుడే ప్రతినిధి:
జిల్లా టీబీ నియంత్రణ సంస్థ అధికారి డాక్టర్ భాను నాయక్ ఆదేశాల మేరకు ఏఐ పరిజ్ఞానంతో అత్యాధునిక ఎక్స్–రే ద్వారా టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారిణి డాక్టర్ ఆర్. స్వర్ణలత సూచించారు. స్ధానిక ఆటోనగర్లో సోమవారం వాసవ్య మహిళా మండలి అపోలో టైర్ హెల్త్ కేర్ సెంటర్, ఎన్టీఆర్ జిల్లా టీబీ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఊపిరి తిత్తుల రోజు పురస్కరించుకొని ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిబిరంలో సాధారణ అనారోగ్య సమస్యలకి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే కార్మికులలో వివిధ కార్యక్రమాల ద్వారా క్షయవ్యాధిపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అపోలో టైర్ హెల్త్ కేర్ సెంటర్ ప్రాజెక్టు మేనేజర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ గాలి ద్వారా ఒకరి నుండి ఇతరులకు క్షయ వ్యాధి సులభంగా సంక్రమిస్తుందన్నారు. క్షయ ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారు. షుగర్ అదుపులో లేనివారికి, హెచ్ఐవి సోకినవారితో పాటు మందులు సక్రమంగా వాడని వాళ్ళకి, స్టెరాయిడ్ మందులు అధిక మోతాదులో వాడేవాళ్ళకి టీబీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీబీ నియంత్రణ సంస్థ ఎస్ టి ఎస్ ఉమా మహేశ్వర రావు సిబ్బందితో కలిసి ఉచితంగా ఏఐ పరిజ్ఞానంతో అత్యాధునిక ఎక్స్–రే ద్వారా టీబీ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా క్షయ వ్యాధి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి సిబ్బంది, ఎజెఆర్ సత్యప్రసాద్ , ఎస్ .ఆనందరావు, డి.నాగరాజు, పి.సుదర్శన్ , డి.వీరాంజనేయులు, ఎం.సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 336







