పట్టాతో పేదల్లో ఆత్మగౌరవం
దశాబ్ధాల భూ సమస్యకు పరిష్కారం
26,401 కుటుంబాలకు పట్టాలు
పోలవరంతో నీటి భరోసా
మహిళల ఉపాధికి ప్రాధాన్యం
విజయవాడ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి టుడే ప్రతినిధి :
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో 26,401 పేద కుటుంబాలకు ఇంటి స్థలాలపై హక్కులు కల్పించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో సీఎం పట్టాలు పంపిణీ చేశారు. విజయవాడలో 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలాలకు పేదలకు హక్కులు కల్పించామని చంద్రబాబు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.28,112 కోట్లు ఉంటుందని చెప్పారు. విశాఖలో 28 వేల మంది, మంగళగిరిలో 5,800 కుటుంబాలకు ఇప్పటికే పట్టాలు ఇచ్చామని, తాజాగా విజయవాడతో కలిపి రాష్ట్రంలో సుమారు 60 వేల పేద కుటుంబాలకు పట్టాలు అందించినట్లు వివరించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాష్ట్రంలో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. రీసర్వే పూర్తి చేసి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. పట్టాలు పొందిన వారు వాటిని భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పోలవరంతో నీటి భరోసా
వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. 2028 కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా-గోదావరి జలాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు.
మహిళల ఉపాధికి ప్రాధాన్యం
విశాఖ, విజయవాడ నగరాలు మహిళా వర్క్‌ఫోర్స్‌లో కీలకంగా ఉన్నాయని సీఎం తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ‘స్వయం’ బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లు పూర్తి చేశామని, వచ్చే ఏడాదిలో మరో 5.5 లక్షల ఇళ్లను అందిస్తామని తెలిపారు.

అమరావతి-విజయవాడ అభివృద్ధి
అమరావతిని అత్యుత్తమ రాజధాని నగరంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. అమరావతి-విజయవాడ-గుంటూరు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి మెరుగైన కనెక్టివిటీ కల్పిస్తామని చెప్పారు. రాజధానిలో గ్రీన్ ఎనర్జీ, పచ్చదనం, నెట్‌జీరో లక్ష్యాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పట్టణాల్లో రూ.50 వేల కోట్లతో, గ్రామీణ ప్రాంతాల్లో రూ.11 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని వెల్లడించారు.
ప్రతి అడుగు స్వర్ణాంధ్ర వైపే
కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని సీఎం అన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని చంద్రబాబు కోరారు.
Views: 490







