సర్టిఫికెట్ల జారీకి ఉద్యోగుల పాట్లు
రోజుల తరబడి నీరీక్షిస్తున్న అర్జీదారులు

అమరావతి టుడే ప్రతినిధి : స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో సాంకేతిక సమస్యలతో సర్టిఫికెట్ల జారీ నిలిచిపోతోంది. గత కొన్ని రోజులుగా ఎస్‌జీఎస్‌డబ్ల్యూ కార్యాలయాల్లో ఉపయోగించే ఏపీ సేవా పోర్టల్ సక్రమంగా పనిచేయకపోవడంతో సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వివిధ సర్టిఫెకట్ల కోసం కార్యాలయాలకు వచ్చే వారిని గంటల తరబడి నిరీక్షింపజేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఏపీ సేవా పోర్టల్లో సిబ్బంది కుల, ఆదాయ తదితర ధ్రువీకరణకు సంబంధించిన దరఖాస్తులను పూర్తిచేసేందుకు ప్రయత్నించగా వెంటనే ఈ సేవలు మన మిత్ర యాప్ ద్వారా చేసుకోవాలంటూ పాప్ అప్ మెసేజ్ వస్తోంది. ఇక చేసేదిలేక అర్జీదారుల మొబైల్స్‌లో మనమిత్ర అప్లికేషన్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తే ఆధార్ నంబరు, చిరునామా, ఇతర అంశాలు మ్యాచ్ అవ్వకపోవడంతో అక్కడ కూడా దరఖాస్తు పూర్తిచేయడం కుదురడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో రెండు చోట్లా దరఖాస్తు అప్‌లోడ్ కాకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వివిధ విద్యార్థులు నిత్యం పదుల సంఖ్యలో ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం సచివాలయాలకు వస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలతో వారి దరఖాస్తులు అప్‌లోడ్ కాకపోవడంతో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. ఈ విషయాన్ని స్వర్ణ గ్రామ, వార్డు శాఖ సాంకేతిక విభాగానికి తెలియజేసినా సరైన రీతిలో స్పందించకపోడంతో దరఖాస్తులను స్వీకరించలేకపోవడంతో కార్యాలయాలకు వచ్చే అర్జీదారులు తమను దూషిస్తున్నారని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.
Views: 504







