క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తించాలి
హోంమంత్రి వంగలపూడి అనిత
అమరావతి టుడే ప్రతినిధి :
పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముకని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు భరోసా కల్పించాలని నూతన కానిస్టేబుళ్లకు సూచించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్‌లో 2025–26 బ్యాచ్‌కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి, ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఎన్నో అడ్డంకులను అధిగమించి కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తయిందని, వీరిలో 2,330 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండటం విశేషమన్నారు.
ప్రజలకు భరోసా కల్పించాలి
విపత్తులు, బందోబస్తు, అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అనిత సూచించారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు తెలిపారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, సత్వర న్యాయం అందేలా పనిచేయాలని సూచించారు. పోలీసు యూనిఫాం ప్రజల్లో భయాన్ని కాకుండా భరోసాను కల్పించేలా ఉండాలని అన్నారు.
రాజ్యాంగానికి అనుగుణంగా విధులు
రాజ్యాంగానికి అనుగుణంగా, రాగద్వేషాలకు అతీతంగా నీతి
, నిజాయితీ, కర్తవ్య స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని హోంమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన 2047 విజన్‌లో కానిస్టేబుళ్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పదవీ విరమణ వరకు క్రమశిక్షణతో, ప్రశాంతంగా ప్రజలకు సేవలందిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని నూతన కానిస్టేబుళ్లకు సూచించారు.
Views: 84







