
హెచ్ఐవి నివారణలో యువత పాత్ర కీలకం… డాక్టర్ భానూనాయక్
యువత భాగస్వామ్యంతోనే హెచ్ఐవి రహిత సమాజం
అమరావతి టుడే, ప్రతినిధి :
హెచ్ఐవి నివారణలో యువత పాత్ర కీలకం అని..యువత భాగస్వామ్యంతోనే హెచ్ఐవి రహిత సమాజం సాధ్యమని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ డాక్టర్ భానూనాయక్ అన్నారు. స్ధానిక బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలలో భాగంగా యువతీ యువకులకు 5కే మారధాన్ రెడ్రన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని క్లస్టర్ పోగ్రాం మేనేజర్ లంకపల్లి మధుసూధనరావు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ డీ యుగంధర్లతో కలిసి 5కే మారధాన్ రెడ్రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతీయువకులు హెచ్ఐవి బారిన పడకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏమీ లేదని.. యువతీ యువకులు సమష్టిగా హెచ్ఐవిపై పోరాటం చేసి హెచ్ఐవి రహిత సమాజ స్ధాపనకు సహకరించాలని అన్నారు.

విజేతలు రాష్ట్రస్ధాయి పోటీలకు ఎంపిక
17 నుంచి 25 సంవత్సరాలలోపు కళాశాల విద్యార్ధులకు విభాగాల వారీగా 5కే మారధాన్ రెడ్రన్ నిర్వహించి ప్రధమ బహుమతి రూ. 10వేలు, ద్వితీయ బహుమతి రూ.7వేలు అందజేయటంతో పాటు రాష్ట్రస్ధాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. యువత సత్ప్రవర్తనతో జిల్లాను హెచ్ఐవి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. 5కే మారధాన్ రెడ్రన్ పోటీలలో పలు కళాశాలలకు చెందిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలు వీరే…
5కే మారధాన్ రెడ్రన్ పోటీలలో పురుషుల విభాగంలో
ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పీ వినయ్ ప్రధమస్ధానం, పీబీసిద్దార్ధ కళాశాలకు చెందిన బీ పవన్ ద్వితీయ స్ధానంలో నిలిచారు. అలాగే మహిళల విభాగంలో కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన ఎస్ సర్వజ్ఞ ప్రధమ స్ధానం, నున్నకు చెందిన డీ భవాని ద్వితీయ స్ధానంలో నిలిచి రాష్ట్రస్ధాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీలలో పాల్గొన్నవారికి డాక్టర్ భానూనాయక్ చేతులమీదుగా పార్టిసిఫేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలోపీఓ మల్లేశ్వరరావు ఎన్టీఆర్జిల్లాలోని స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు, పలు కళాశాలలకు చెందిన విద్యార్దులు పాల్గొన్నారు.
Views: 896







